top of page

KAMADRI

తను ఓ అవతారంగా చెప్పుకోలేదు...

ree

చాలా ఏళ్ళ కిందట మొదటిసారి వార్త జర్నలిస్టు మిత్రులతో కలసి

షిరిడికి వెళ్ళాను. ఆ తరువాత మరో రెండుసార్లు చూసా. రేడియో రాంబాబుతో కలిసి 2018లో షిరిడి పర్యటించా. అపుడు అనిపించింది సాయిబాబా మీద ఓ పుస్తకం ఎందుకు రాయకూడదని. అప్పటికే సాయిబాబా గురించి కొన్ని పుస్తకాలు చదివా. ఓ సారి పుస్తకం రాయాలనుకున్నాక చాలా పుస్తకాలు అధ్యయనంలో భాగమయ్యాయి. దాదాపు వందేళ్ళ కిందట మన కళ్ళ ముందే కదలాడిన మనిషిని దేవుడిని చేసి కోట్ల మంది ఆరాధిస్తున్నారు. సాయిబాబా తనకు తాను దేవుడని చెప్పుకోలేదు. తనను ఆరాధించమని అడగలేదు. తన మతమేదో కూడా చెప్పలేదు. తను జీవించినంత కాలం ప్రత్యేకించి ఏదో ఒక మతాన్ని అనుసరించలేదు. దేశీయులే గాక విదేశీయులు వచ్చి ఆయన్ని చూసారు. ఆయన మహిమల గురించి అనేకులు అనేకరకాలుగా చెప్పారు. రాశారు. అయితే సాయిబాబా మాత్రం తనకు మహిమలున్నాయని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. సామాన్యమైన మనిషి లా జీవించాడు. మనుషులను ప్రేమించమని చెప్పాడు. ఎవరు ఏ మతాన్ని అనుసరించినప్పటికీ సకల జనులు సామరస్యంతో జీవించాలని కోరారు. తనను జనులు ఓ బాబాగా చేస్తున్నప్పటికీ తనకు తాను బతికి ఉన్నంత కాలం సాధారణమైన మనిషిగా మెలిగారు. అయితే ఇవాళ అనేకులకు ఆయన పట్ల విశ్వాసం వుంది. ఓ గురి వుంది. ఆయనను నమ్ముకుంటే తాము తలపెట్టిన పనులు జరుగుతాయన్న నమ్మకమూ ఉంది.

ఎవరి నమ్మకాలు వారివి కదా. వాటిని మరొకరు కాదన్నంత మాత్రాన ఆ నమ్మకాలు చెదిరిపోవు. మరొకటి భక్తుల నమ్మకాలు ఇతరులకు అయితే హాని చేయడం లేదు. సాయిబాబా ఆలయాల చెంత కొన్ని వందల మందికి అన్నం పెట్టడం చూసా. దానికి అభ్యంతరం ఎందుకు.

మా నాయిన కమ్యూనిస్టు. నిజాయితీ గల కమ్యూనిస్టు. అయితే తను దైవాన్ని కాదనలేదు. మా ఇంట్లో ఉప్పలమ్మ పండగ చేస్తారు.

మా నాయినకు మేం ఎనిమిది మందిమి.

అందరూ కమ్యూనిస్టులు కాకున్నా ఆ కమ్యూనిస్టు విలువల ప్రేరణ మా కుటుంబ సభ్యులలో కొనసాగుతూ వుంది. కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మరొకరి నెత్తి గొట్టి బతికే లౌక్యం ఎవరికీ అలవడలేదు.

రంగనాయకమ్మ నాస్తికత్వం, కత్తి పద్మారావు హేతువాద ఉపన్యాసాలు, విప్లవోద్యమాల ప్రభావాలు కౌమార యవ్వన కాలాల నుంచి పాదుకోగా దేవుడు ఉన్నాడు సరే, ఆ దేవుడిని పుట్టించింది ఎవరు అని ప్రశ్నించడం నేర్పింది.

అంతమాత్రాన దేవుడిని నమ్మేవారి అభిప్రాయాలను దురుసుగా ఖండించరాదనే భావాలను సైతం కమ్యూనిస్టు, విప్లవోద్యమాలు నేర్పాయి.

ఓ పాతికేళ్ళ కిందట నేనూ, రామకృష్ణ కలకత్తాలో దసరా చూద్దామని దసరా టైమ్‌కే వెళ్ళాం. అక్కడి నవరాత్రి ఉత్సవాలలో మార్క్సిస్టు కార్యకర్తలు పాల్గొనడం, కాళికమాత విగ్రహాల చెంతనే ఎర్రజెండాలు ఎగరడమూ చూసాం. భిన్నత్వంలో ఏకత్వమే కాదు, మతాలు నమ్మని వారు, దేవుడిని నమ్మని వారు సైతం నమ్మకం ఉన్నవారి నమ్మకాలను గౌరవించడం గమనించాం.

రవీంద్రనాథ్‌ టాగూర్‌, రామకృష్ణ పరమహంస, వివేకానంద వచ్చిన బెంగాల్‌ నుంచే చారుమజుందార్‌ వచ్చారు. నక్సల్బరీ ఇప్పటికీ పాలకులకు దడ పుట్టిస్తున్నది.

ఇలాంటి పూర్వరంగంలో ఇవాళ సాయిబాబా మీద కొందరు వివాదాలు సృష్టించడం హాస్యాస్పదంగా తోస్తున్నది.

అతనికో మతాన్ని అంటగట్టి రాద్ధాంతం చేయడం వింతగా వుంది. గాఢమైన సాయిబాబా భక్తులే వారికి సమాధానం చెబుతారు. లౌకికతత్వాన్ని ప్రగాఢంగా నమ్మే 'ది హిందూ' పత్రిక వారు కొన్నేళ్ళ కిందల సాయిబాబా మీద ఓ స్పెషల్‌ వెలువరించారు.

ఆ స్పెషల్‌ కూడా నా పుస్తక రచనకు ఉపకరించింది. నిజానికి సాయిబాబా జీవితం మీద సాధికారికమైన పుస్తకాలు రావాలి. తను మన మధ్య నుంచి వెళ్ళిపోయి వందేళ్ళు. ఆయనను ప్రత్యక్షంగా చూసినవారు వున్నారో లేరో తెలియదు. కానీ సాయిబాబాతో మాట్లడినవారిని చూసిన జనాలు ఉన్నారు. వెదుక్కుంటూ పోతే మూలాలు దొరక్కపోవు. ఆ మధ్యన సంత్‌ గాడ్గే బాబా గురించి సాంబశివరావు ఓ పుస్తకం రాశాడు. అది నాకు బాగా నచ్చింది.

ఆరాధించేవారిని ఆరాధించనివ్వండి.

నమ్మేవారిని నమ్మనివ్వండి.

పోయేదేం లేదు.

సాయిబాబా గురించి దొరికిన కొద్ది సమాచారం మేరకు గమనిస్తే ఆయన జీవితాచరణలో లౌకికత్వం వుంది. సూఫీతత్వమూ వుంది. ఇతరులకు హాని చేయరాదన్న మానుషత్వం వుంది. ఈ మానుషత్వాన్ని కొందరయినా సంతరించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండక్కర్లేదు... కదా.


 
 
 

Comments


bottom of page