top of page

KAMADRI

మండేలా మహాత్ముడు ఎలా అయ్యాడు?

ree

మిత్రుడు రాపోలు సీతారామరాజు రాసిన పుస్తకం `మండేలా మహాత్ముడు ఎలా అయ్యాడు?` ఈ పుస్తకాన్ని ముందుగా చదివే అవకాశం లభించింది. మండేలా గురించి దక్షిణాఫ్రికా నేల మీద ఉండి రాయడం చెప్పుకోదగింది. అక్కడి నేల, అక్కడి గాలి, అక్కడి సంస్కృతి, అక్కడి వేషభాషలు ఎప్పటికప్పు

డు తన అనుభవంలో సంలీనం చేసుకుంటూ, అక్కడి మనుషుల మధ్య జీవిస్తూ మండేలా గురించి చెప్పడం నచ్చింది. ఆఫ్రికన్ల మధ్య నివసిస్తూ - వర్ణవివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలమంతా పోరాడిన మండేలా మహోన్నత వ్యక్తిత్వం ఆవిష్కరించడం ఈ రచన ప్రత్యేకత.

అణచివేతకు, పీడనకు వ్యతిరేకంగా గళమెత్తే సంప్రదాయం తెలుగు కవిత్వ ప్రపంచానికి వుంది. ఒక తరానికి తరం దక్షిణాఫ్రికాతో, అక్కడి జాత్యాహంకార వ్యతిరేక పోరాటంతో గొంతు కలిపింది. ఆఫ్రికన్‌ కవుల కవిత్వాన్ని గానం చేసింది. మూడు దశాబ్దాల పైబడి జైలులో వున్న మండేలా ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైన యోధుడు. ఈ గ్లోబలైజేషన్‌ కాలంలోనూ ప్రతిఘటనా శక్తులకు, తిరుగుబాటు తత్వానికి ప్రతీక మండేలా. అలాంటి మండేలా గురించి రాపోలు సీతారామరాజు రాయడం బాగా బాగా నచ్చింది.

తన పరిచయం కన్నా ముందు తన పేరుతో, తన కవిత్వ వ్యాసాలతో పరిచయం ఏర్పడింది. సాహిత్య పేజీల్లో సాహిత్య వ్యాసం కింద ‘‘రాపోలు సీతారామరాజు ` దక్షిణాఫ్రికా’’ అనే పేరు కనిపించేది. ఎవరీ పెద్దమనిషి అనుకునేవాడిని.

కరోనా కాలంలో ఇక్కడికి వచ్చాక - మొదటిసారి బాగ్‌లింగంపల్లికి వచ్చాడు. తనని చూడగానే ఉరిమే ఉత్సాహం ఉన్న యువకుడని అర్థమైంది. ఆ రోజు తను వచ్చాక కాస్సేపటికి విల్సన్‌రావు, నారాయణశర్మలు వచ్చారు. వారిద్దరే తనను పరిచయం చేశారు. తన గురించి చెప్పారు. ముగ్గురం చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తను ఉన్నంత సేపు అక్కడి జీవితం, మనుషులు, ముఖ్యంగా అక్కడి లైబ్రరీలు, పుస్తకాలు, పత్రికలు అమ్మే షాపులు - చదివే అలవాట్ల గురించి మాట్లాడుతూ పోయాను. తరువాత కొన్నాళ్ళకు తన కవిత్వ వ్యాసాలతో ` పరావర్తనం ` వచ్చింది. అంతకుముందు నానీల పుస్తకం వచ్చిందన్నారు.

పదేళ్ళుగా దక్షిణాఫ్రికా - జోహన్నెస్‌బర్గ్‌లో నివాసం ఉంటున్న సీతారామరాజు అంటే ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. తను కలిసిన ప్రతి సందర్భంలోనూ అక్కడి విషయాలే ప్రస్తావించా. అక్కడి ప్రదేశాల గురించి, లైబ్రరీల గురించి రాయవలసిందిగా అడిగా. ఈతరం అక్కడ మండేలాను ఎలా గుర్తు చేసుకుంటున్నారని ప్రశ్నించా. తమ చరిత్రను తాము తలపోస్తున్నారా లేదా అని అడిగా. తను అక్కడికి వెళ్ళాక అక్కడి విషయాలు రాయవలసిందిగా కోరాను.

దక్షిణాఫ్రికాలో మండేలా నిర్బంధంలో ఉన్న జైలును చూడటానికి అయిదారు సార్లు మిత్రులతో వెళ్ళినట్టు చెప్పాడు. దాదాపుగా చాలా ప్రాంతాలు తిరిగిన అనుభవాలను అపుడపుడు పంచుకున్నాడు. ఆమధ్యన కొన్నాళ్ళ కిందట తిరిగి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్ళాక అపుడపుడు మాట్లాడాడు. ఒకటీ రెండు యాత్రాకథనాలు రాశాడు. గౌతమ్‌ లింగా గురించి కొన్నిసార్లు చెప్పాడు. గౌతమ్‌ ఓ మంచి యాత్రాకథనం ఈమధ్యన రాశాడు.

...

కొన్నాళ్ళ కిందట మండేలా గురించి రాస్తున్నట్టు చెప్పాడు. అది ఇపుడు ఏకంగా మూడు వందల పేజీల పైబడిన పుస్తకంగా త్వరలో వెలుగు చూడబోతుంది. ఆ స్క్రిప్ట్‌ చదివాను. సరళంగా వుంది. చక్కటి రీడబులిటీ వుంది. ఉద్విగ్నభరితమైన చరిత్రను ఆకట్టుకునేలా చెప్పిన శైలి ఆకర్షించింది. మామూలు మానవుడు మండేలా మహామనీషి ఎలా అయ్యాడో చెప్పాడు. మండేలా శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వృద్ధాప్యం... విభిన్న దశలలో పరిణతి సాధించిన వైనం పూసగుచ్చినట్టు చెప్పిన తీరు ప్రత్యేక ఆకర్షణ. ఇందుకోసం తను పుస్తకాలను, మనుషులను, ప్రాంతాలను, చరిత్రను, సంస్కృతులను అధ్యయనం చేశాడు. సీతారామరాజు చేసిన కృషిని ఇందుకే మెచ్చుకోవాలనిపిస్తుంది. మండేలా గురించి మాత్రమే కాక దక్షిణాఫ్రికా చరిత్ర, నైసర్గికత, రాజకీయాలు, నేటి యువత ఆలోచనలు ఎన్నో చెప్పిన తీరులో ఓ క్రమం ఉంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రోది చేస్తుందీ రచన.

అక్కడి ప్రాంతాల పేర్లు, మనుషుల పేర్లు వారి ఉచ్చారణకు అనువుగా రాశాడు. వాళ్ళ భాషలోని, సంస్కృతిలోని, చరిత్రలోని, పోరాటంలోని జీవధాతువును తన అక్షరాల్లోకి తీసుకురావడంలో సఫలమయ్యాడు. మండేలాను ఆవాహన చేసుకొని మండేలాను మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు. మండేలాకు గాంధీ ఎలా స్ఫూర్తిగా నిలిచాడో ప్రస్తావించాడు.

నల్లగొండ జిల్లా చిట్యాల దగ్గర నేరడ ప్రాంతంలో తన బాల్య, కౌమార, యవ్వనాలను గడిపిన రాపోలు సీతారామరాజుకు - అతనికి తెలియకుండానే అతనిలో ఆ ప్రాంతపు చైతన్యం పాదుకుని వుంటుంది. మనిషి ఎక్కడున్నా తన మూలాలని, తన నేల తాత్వికతను మరచిపోడంటారు. మండేలా స్ఫూర్తిని, మండేలా జీవితాన్ని, మండేలా ఉదాత్తతను ఈతరం తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్న సీతారామరాజు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాడు. ఈ పుస్తకం చదవడం ఉద్విగ్నపూరిత అనుభవం. ఒక కొత్త లోకాన్ని మన కళ్ళ ముందే ఆవిష్కరించే, మానవ చరిత్రలో శిఖరప్రాయమైన మానవీయ మూర్తిని దర్శింపజేసే సీతారామరాజు రచన ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం, అనన్యం.


 
 
 

Comments


bottom of page