top of page

KAMADRI

పాలపిట్ట కథ - 2025 కొత్త కథల సంకలనం

Book Review | Palapitta katha 2025 | Book Review

ree

తెలుగునాట సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం తరువాత కథా ప్రక్రియనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. భిన్న వర్గాలకు, ప్రాంతాలకు, భావజాలాలకు చెందిన వారు కథలు రాస్తున్నారు. వస్తుశిల్పాల్లో ప్రయో

గాలు చేస్తున్నారు. కొన్ని వందల మంది విస్తృతంగా రాస్తూ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఈ క్రమాన విభిన్న సమూహాలకు చెందిన వారి కథలను ఒకచోట చేర్చి సంకలనాలుగా తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ‘పాలపిట్ట కథ-2025’ మీ ముందుకు వచ్చింది. 2023లో ‘పాలపిట్ట’ నుంచి దీపావళి ప్రత్యేక కథల సంచిక వెలువడిరది. 2024లో ‘ఉగాది’ ప్రత్యేక కథల సంచిక వచ్చింది. ఈ ఏడాది విలక్షణమైన కథలతో ఈ సంకలనం రూపొందింది.

మన సమాజ గమనాన్ని, మానవ నైజాన్ని, మనుషుల పోకడలను తెలియజేసే కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. వ్యవస్థలకీ, మనుషులకీ నడుమ సంఘర్షణను, మానవ మనస్తత్వంలోని వైచిత్రిని ప్రతిఫలించే కథలు ఇందులో చూడొచ్చు. చట్టాలు, నీతిసూత్రాలు, నిజాయితీ, నిబద్ధత అనే పదాలు చూడటానికి అందంగా ఉంటాయి. వీటికి అనుగుణంగా మనుషులు జీవించాలని, సామాజిక, పాలనా వ్యవస్థలు పని చేయాలని కోరుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించే నాయకులు, ప్రభుత్వాధికారులు, వైద్యులు ఎల్లెడలా తారసపడతారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే ఒక అనర్హతగా పరిణమించే సందర్భాలుంటాయి. ఇలాంటప్పుడు సానుకూలంగా ఆలోచించే వారు తమ చేతుల్లో లేని పరిణామాల పట్ల ఎలా స్పందిస్తారో ఈ కథలు చెబుతాయి.

కుటుంబాల్లో ప్రజాస్వామిక వాతావరణం లోపించినపుడు, కనిపించని పెత్తనాలు మనుషుల మీద రుద్దబడుతున్నపుడు ఎలాంటి ఘర్షణలకు లోనవుతారో కొందరు చిత్రించారు. తమవి కాని లక్ష్యాల కోసం బతుకంతా వృధా చేసుకునేవారిని మేల్కొల్పే కథలూ ఉన్నాయి. నువ్వేమిటో తెలుసుకొని, నీ సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించు కోవాలని చెప్పే పాత్రలు స్ఫూర్తినిస్తాయి. తమ పరిధిలో చేతనైన సహాయం చేస్తూ తాము సంతోషంగా ఉంటూ పదుగురి సంతోషానికీ, మేలుకు తోడ్పడాలన్న చింతనను ప్రోది చేసే కథలూ ఈ సంకలనంలో ఉన్నాయి.

జాతీయంగా, అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా, స్థానికంగా మానవ జీవితం అనేక సంక్లిష్టతలను, సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నది. ఈ 2025 సంవత్సరం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు, నియంతల దౌర్జన్యాలు, ఆధిపత్య వర్గాల నుంచి ఎదురయ్యే సవాళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. గ్లోబలైజేషన్‌ మూలాన ప్రపంచం కుగ్రామంగా మారిందో లేదో గానీ కుగ్రామంలో ఉన్నవారి బతుకుల్ని సైతం ఛిద్రం చేసే కుట్రలు, కుతంత్రాలు అమలవుతున్నాయి. మతం పేరిట, కులాల పేరిట పెరిగిన విభజన, విద్వేషం జనం బతుకుల్లో చిచ్చు పెడుతున్నాయి. ఈ పరిణామాల గురించి మన కథకులు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే ఎలా స్పందిస్తున్నారు? ఈ పరిణామాల ప్రభావాలను తమ కథల్లో ఏ రీతిన చిత్రిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథలు చదవాలి.

అయితే కథలంటే విశ్లేషణలు, వివరణలు కావు, డాక్యుమెంట్లు కావు, వ్యాసాలు కావు. కథ అంటే ఓ కళాత్మక ప్రక్రియ. విడమరిచి, విశ్లేషించి చెప్పడం కథకులు చేయరు. ఆలోచించేందుకు ప్రేరణ ఇస్తారు. కొన్ని సూచనలు ఇస్తారు. కథా నిర్మాణంలో తమవైన వ్యక్తీకరణ పద్ధతులని అనుసరించి చెబుతారు. సమస్యలను ఏకరవు పెట్టి వాచ్యం చేయరు. ప్రతీకాత్మకంగా, మనుషుల్లోని వైరుధ్యాలను, అంతరంగ కల్లోలాలను చిత్రించడం ద్వారా ఆలోచనలకు దారులు పరుస్తారు. ఏదయినా అందంగా చెబుతూనే తమ లోపలికి తాము చూసుకునేందుకు తావునిస్తారు.

రచయితలు నేరుగా తీర్పులు చెప్పరు. మంచి పాత్రలు, చెడ్డ పాత్రలంటూ ప్రత్యేకించి వుండవు. ఆయా పాత్రలు ఏయే పరిస్థితుల నడుమ ఏవిధంగా ప్రవర్తిస్తాయో చిత్రించడమే కథకుల పని. వ్యక్తులు తీసుకునే నిర్ణయాలకు సామాజిక చట్రాలకు మధ్య అంతర్గత సంబంధం వుంటుంది. ఆ సంబంధాలను అర్థం చేసుకుంటూ ఆయా పాత్రల పోకడలను గమనిస్తే తప్ప రచయితలు ఏం చెబుతున్నారో, వారు చెప్పే కథ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో బోధపడదు.

అయితే కథ ముందుగా చదివించాలి. అందుకు కథను ఎంత ప్రతిభావంతంగా, శక్తిమంతంగా చెబుతారన్నదే ప్రధానం. కథకుల శిల్ప చాతుర్యం, కథన కౌశలం వారి అధ్యయనం మీద, అనుభవం మీద ఆధారపడి వుంటాయి. ఈ సంకలనంలోని కథలు ఆయా రచయితల ప్రతిభా సంపత్తులను అనుసరించి వున్నాయి. వారి అవగాహనను, ఆలోచనారీతులను, కళాత్మక పాటవాన్ని చెప్పకనే చెబుతాయి. వీటిని పాఠకులు చదివి గ్రహించడం మంచిది.

మొత్తం 31 కథలు ఉన్నాయి. 272 పేజీల పుస్తకం ఇది.




 
 
 

Comments


bottom of page